achala-vedantha

o ఓ o
సద్గురు పరబ్రహ్మణే నమః

సృష్టి సిద్ధాంతంలో మానవుడు ఆవిర్భవించడం అనేది ఒక అద్భుతమైన సంఘటన. పరిణామ సిద్ధాంతంలో అనేక జన్మపరంపరలో తనలో వున్నటువంటి తామసిక, రాజసిక, సాత్విక గుణ సముదాయాన్ని, క్రమంగా వికసింపజేస్తూ, ఆయా గుణాలను ఆధారం చేసుకుని, తన యొక్క వికాస క్రమాన్ని పూర్తి చేసుకుంటూ, జీవుడు పొందినటువంటి చిట్టచివరి ఉపాధి మానవ దేహం. ఈ మానవ దేహానికి ప్రాధాన్యత బుద్ధి వికాసం కలిగి వుండటమే అనేది అందరికి తెలిసిన సత్యం. అయితే పూర్వక్రమాను సారంగా జీవ పరిణామంలో, 84 లక్షల జీవరాశులనుంచి తాను సంక్రమింప చేసుకున్నటువంటి, అనేక సంస్కార బలాలని, వాసనా బలాలని మానవ దేహంలో పూర్తిగా వికసింపజేస్తూ, వాటిని అనుభవించి, వాటిని అధిగమించ గలిగేటటువంటి అనేక లక్షణాలని మానవుడు కలిగివున్నాడు.

  అయితే మానవ జీవనంలో వచ్చినటువంటి, ప్రాథమికమైనటువంటి సమస్యలల్లా ఏమిటంటే, పూర్వ వాసనాబలం చేత, జంతువుగా వున్నప్పుడు, ప్రాథమికమైనటు వంటి ఆహార, నిద్రా, భయ, మైథునములనే శరీరమే నేననేటటువంటి ప్రాథమికమైన స్థితిని కలిగి వుండటం చేత, ఆ నాల్గింటికి జీవితాన్ని ఉపయోగించడానికే ఎక్కువ కాలాన్ని వినియోగిస్తూ వచ్చింది. ఇది ఆది మానవుడి పరిస్థితి. అయితే ఈ ఆదిమానవుడి పరిస్థితి నుంచి నేటి నాగరిక మానవుడి వరకు కూడా, ఈ ఆహారనిద్ర, భయ, మైథునముల యెడల రోజువారీ 24 గంటల జీవితంలో, తాను ఉపయోగించేటటువంటి కాలము, వివేకము పెద్దగా మారలేదు. కానీ, పైపై మెరుగులు చాలా మారాయి. ఈ మార్పులన్నీ కూడాను కాల ప్రమాణంలో జరుగుతూ వచ్చినప్పటికీ, మానవుడికి వున్నటువంటి వివేకం ఇంకా పూర్తి స్థాయిలోకి పరిణామం చెందలేదు. అది పూర్తిగా పరిణామం చెందించే విధానంలో భారతీయ సంస్కృతి గాని, భారతీయ ఆచార వ్యవహారాలు గాని, సనాతనమైనటు వంటి ఋషి సాంప్రదాయం గానీ, ఎన్నో లక్షల సంవత్సరాల ముందుకి, యుగాల ముందుకి కూడా ఆలోచించి
మానవులందరూ ఎట్లా జీవిస్తే, ఈ వివేకం పూర్తిగా సుసంపన్నం అవుతుంది?
            మానవులందరు ఈ సృష్టిని ఎట్లా పరిరక్షించ గలుగుతారు?
            సృష్టికి తాను ఎట్లా సహాయపడగలుగుతాడు?
            ఈ సృష్టిని ఎట్లా అధ్యయనం చేయగలుగుతాడు?

            సృష్టిని అధ్యయనం చేసి, తాను సృష్టికి పూర్వ స్థితిని ఎట్లా అనుభవించ గలుగుతాడు? తెలుసుకోగలుగుతాడు?
            వాటిని తెలుసుకుని సర్వవ్యాపక స్థితిలో తనదైనటువంటి స్థితిలో తాను నిలిచివుండి, ఈ దేహాన్ని పనిముట్టుగా ఎట్లా వుపయోగించగలుగుతాడు? అనే అంశాల మీద తీవ్రమైనటువంటి పరిశోధనలు సలిపారు. అనేకమంది అనేక మార్గాలలో ఋషులుగా, మహర్షులుగా, ఆచార్యులుగా, తమ తమ విజ్ఞానాన్ని అనేక రూపాలలో అందించారు. అయితే ఈ విజ్ఞాన భాండాగారమంతా కూడా, ఆనాటి భాషా సాంప్రదాయాలలో, గ్రాంథిక భాషలో, సాంస్కృతిక భాషలో, అప్పటి ఆచార వ్యవహారాలకు సరిపోయినట్లుగా, సంస్కృతం మూలంగా వుండటం చేత, నేటి నాగరిక మానవులకి ఆ భాష దురబగాభ్యంగా వుండటం చేతఅర్థం చేసుకోవడానికి అవకాశం లేకపోవటం చేత, సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా అర్థమయ్యే భాషలో వున్నటువంటి దానికి మొగ్గు చూపటం అలవటైపోయింది.

            అయితే మానవుడికి ప్రధాన అడ్డంకి 'అలవాటే'. తాను ఉదయం లేచింది మొదలు, రాత్రి నిదురపోయే వరకు, నిద్రపోయేటప్పుడు కూడా అలవాటుకే బానిస అయ్యి వున్నాడు. ఎట్లా అయితే జంతువు తన సహజ లక్షణాలకు బానిస అయివున్నదో, మానవుడు కూడా తన సహజ లక్షణమైనటువంటి 'వివేకాన్ని నిలుపుకోవడం' ప్రధానంగా జీవించకుండా, తన పూర్వ లక్షణాలైనటువంటి, 'దేహమే నేను' అనేటు వంటి జంతువు వాసనా బలంతోటి జీవించడానికి ఎక్కువ కాలం తన జీవితంలో వినియోగించటం చేత, మానసికంగా బలహీనపడి, అనేక ఒత్తిడిలకు లోనవుతూ, వాటివల్ల దుఃఖాన్ని పొందుతూ, ఆ దుఃఖాన్ని ఉపశమింప చేసుకోవడానికి అనేక రకములైనటువంటి మార్గాలను అన్వేషిస్తూ, అయా మార్గాలలో అనేక రకాలైనటువంటి, కర్మకాండని, సాంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని, శాస్త్రాలని తనకు తానే నిర్మించుకుంటూ ప్రయాణం సాగిపోతున్నది.

            అయితే ఇదంతా కూడా సృష్టి కర్త దృష్ట్యా చూచినప్పుడు, సృష్టిలో భాగమే అయివున్నది. ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త దృష్ట్యా చూస్తే, అతనిలో అంశీభూతమై యున్నది. కాబట్టి అనంతమైనటువంటి సృష్టి, సృష్టి ఆది స్థితియందు, అంశీభూతంగా వున్నది. మనమందరం మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా, మాటల వెనుకాల వున్న నిశ్శబ్దంలో అంశీభూతాలుగా వున్నాయన్నమాట. ఈ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవాలి అంటే, నిశ్శబ్దాన్ని ఆచరించే జీవితం వుంటే తప్ప, నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేమన్నమాట. ఆ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవటంలో భాగంగానే, అనేక రకాలైనటువంటి సాధనలు వచ్చాయి. వాటిలో భాగంగానే మంత్ర జపం అని, వాటిలో భాగంగానే ధ్యానం అని, వాటిలో భాగంగానే యోగమని, వాటిలో భాగంగానే మరిన్ని సాధనలు ఇవాళ్టి రోజున అందరికి ప్రచారంలోకి అందుబాటులో వచ్చాయి.

            ఈ మౌనం అంటే ఏమిటంటే, కేవలం మాట్లాడకుండా వుండటమే మౌనం కాదిది. మానసిక మౌనమే నిజమైన మౌనానికి ప్రారంభస్థితి. ఈ మౌనంలో ప్రధానంగా తనలోని ఆలోచనలని, భావాలని, తనను తానే పరిశీలించుకుని, ఆ భావాల మూలంలో వున్నటువంటి, ఈ సృష్టికి ఆది స్థితియందు ఈ సృష్టి ఇంత చిలవలు పలువలుగా అల్లుకోవడానికి ఆధారభూతమైనటువంటి, త్రిగుణ సిద్ధాంతాన్ని దీనినే వేదాంతం త్రివృత్కరణమని బోధిస్తూ వున్నది. ఈ సృష్టి మొత్తం అంతా కూడా, సత్వరస్తమో గుణాలతో కూడుకుని వున్నది. అన్ని జీవులు కూడా ఈ మూడు గుణాలతోనే కలిసి వున్నాయి. ఈ మూడు గుణాలయొక్క ప్రాథమికమైనటువంటి ప్రభావం చేతనే, తమ తమ అంతరేంద్రియాలు గానీ, బాహ్యేంద్రియాలు గాని ప్రవర్తిస్తూ వున్నాయి అనేటు వంటి ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే స్థితి వుంటుంది.

            కాబట్టి మానవులు వివేకం ప్రధానంగా జీవించాలి అంటే, మొట్టమొదట అర్థం చేసుకోవలసినది ఏమిటి అంటే? పూర్వం తాను జీవించినటువంటి జంతువుల ఉపాధులలో కలిగినటు వంటి లక్షణ బలం ఏదైతే వున్నదో, అంటే ఏం అర్థం చేసుకోవాలంటే, ఎలాగంటే ప్రతిమానవుడు, ప్రతి బిడ్డా శిశువు పుట్టిన తరువాత తనకు తానే తనయొక్క ఇంద్రియ వికాసానికి కృషి చేస్తూ వున్నది. తనకు తానే బోర్ల పడుతూ వున్నది. తానకు తానే పాకులాడుతున్నది. తనకు తానే కాళ్ళ మీద లేస్తున్నది. తనకు తానే లేచి నిలబడుతున్నది. తల్లిదండ్రులు నిమిత్తమాత్రంగా సహాయకారులుగా వున్నారు. కానీ, తల్లదండ్రులేమో తాము పోషిస్తున్నామని పిల్లల యెడల మమకారాన్ని పెంచుకోవడం, పిల్లలేమో తల్లిదండ్రులు తమని పోషిస్తున్నారనే భావన లేకపోవడం, ఇవాళ మనం గమనిస్తూవున్నాం. ప్రతిజీవిలో కూడా తన పరిణామం దిశగా తానే సాగిపోయే స్వేచ్ఛ నిరంతరాయంగా ప్రవహిస్తూనే వుంది ఈ సృష్టిలో. అటువంటి ఈ జీవి పరిణామంలో, తనంత తాను పురోగమనం దిశగా వెళ్తూ, తన యొక్క వివేకాన్ని తాను నిర్మించుకుని, తనలో వున్నటువంటి, తనదైన స్థితిని తాను అర్థం చేసుకోవడమనే వివేకాన్ని పొందే దశగా ఇంద్రియ వికాసాన్ని పొందుతూ వున్నదన్నమాట. ఈ ఇంద్రియ వికాసం అంతా కూడా, అంతరేంద్రియ నిగ్రహం తరువాత లభించేటటువంటి, ఏదైతే నిశ్శబ్ద స్థితిలో, తనదైన స్థితిలో, తనను తాను విడిగా గుర్తుంచుకోగలిగేటటువంటి స్థితిలో, తనదైన స్వరూపజ్ఞాన స్థితిలో కనుక తనను తాను చూసుకోగలిగేటటువంటి స్థితికి చేరేంత వరకూ ఈ ప్రయాణం సాగుతునే వుంటుంది.

            ఇదంతా కూడా స్వ ప్రయత్నము, స్వ అధ్యాయము అనే రెండింటి మీద ఆధారపడి వుంటుంది. స్వ-అధ్యయము అనేది అన్ని సాధనలలో కెల్ల ఉత్తమమైనటు వంటి సాధన. ఇది జ్ఞానయోగానికి తొలి మెట్టు. నవ విధ భక్తి మార్గాలని మనుష్యులు ఆచరించాలి అనేటటువంటి అతి గొప్ప సాంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతి కలిగియున్నది. మిగిలినటువంటి అన్ని మతాలలో, అన్ని దేశాలలో వున్నటువంటి, అన్ని సంస్కృతులలో కూడా భగవంతుడిని ఆరాధించడం అనేటు వంటి గొప్ప సంస్కృతి వున్నదన్నమాట. ఈ ఆరాధనాభావం అంతా కూడాను, మనిషి తన చిత్తాన్ని పరిశోధించే దిశగానే ఏర్పాటు చేయబడింది. మనిషికి లోపల మనసు, బుద్ధి, చిత్తము అహంకారం అనేటటువంటి నాలుగు ఇంద్రియాలు పనిచేయడం చేతనే, ఈ నాలుగు ఇంద్రియాలు బయిట వున్నటువంటి, 72 వేల నాడులనే స్థూలంగా ఆలోచించే విధానంలోగాని, కన్ను ముక్కు నాలుక చెవులు చర్మం అనే జ్ఞానేంద్రియాలుగానీ లేదూ కర్మేంద్రియాలు గానీ, ఈ పంచప్రాణాలు గానీ, ఈ రకంగా ఏ రకంగా ఎవరు ఏ పద్ధతిలో చెప్పినప్పటికీ, ఈ దేహం మొత్తాన్ని నియంత్రించేవి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నేను అనేటటువంటి జ్ఞాత.

            అయితే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటివి నాలుగు విడిగా వున్నాయా? అని అంటే, ఒకే మనిషి ఒకే ఆలోచన ఒకే స్థితి ఈ నాలుగు పాత్రలను ధరిస్తోందన్నమాట. ఒక రకంగా చూస్తే, ఇది ఏకపాత్రాభినయం లాంటిది, ఒక రకంగా చూస్తే అన్ని పాత్రలను అదే ధరిస్తు్న్న విధానము కూడా వున్నదన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడంలోనే, కొంచెం అవగాహనా సామర్థ్యం పెరగాలి. కానీ చాలా మంది ఇవాళ్టి రోజున, తెలియకుండానే మనసుని నిగ్రహించాలని లేదంటే బుద్ధిని నిగ్రహించాలని ఆలోచిస్తూ వుంటారు. ఈ రెండూ అసాధ్యమైనటువంటి పనులన్నమాట. ఈ రెండూ కూడా ఎటువంటిదంటే, గాలి వీచేటటువంటి మన బాహ్యంలో ప్రకృతిలో గాలి వీస్తూవుంటే, ఆ వీచే గాలిని బంధించ పూనటం ఎంత కష్టతరమో, ఎంతటి అసాధ్యమో ఈ రెండు పనులు కూడా అటువంటి పనులన్నమాట. కానీ వేదాంతం ఏం చెప్పిందంటే, ఎప్పుడూ కూడా మనసు బుద్ధిని కాదు నాయనా, ఈ రెండు అలలు కూడా ఎక్కడినుంచైతే వస్తున్నాయో, ఏ చిత్తంలోనుంచైతే నీకు వృత్తి, అంటే భావమూలం ఎక్కడైతే వున్నదో, అక్కడ సరిగా అవగాహన చేసుకుని, దాన్ని కనుక నీవు శుద్ధిచేసినట్లయితే, ఈ మనసు, బుద్ధి ఎప్పుడూ శుద్ధిగానే వుంటాయి. దీనికి భ్రాంతి అనేది వుండదు. దీనికి దుఃఖము అనేది కలుగదు. ఎప్పుడూ కూడా ఇవి మంచి మార్గంలోనే వుంటాయి. లోక కళ్యాణం దిశగానే వుంటాయి. తద్వారా నీకు కల్యాణం కలుగుతుంది. ప్రశాంత జీవనం వుంటుంది. అనేటటువంటి విధానాన్ని బోధించింది భారతీయ వేదాంత పద్ధతి. ఇదే ఋషి సాంప్రదాయమైనా కూడా.

            కాబట్టి నవవిధ భక్తి మార్గాలను ఆచరించడం చేత, అంటే అర్చనం, వందనం, స్మరణం, పాదసేవనం... ఈ రకంగా ఎవరికి చేతనైనటువంటిది యథాశక్తి, వారు వారు చేయగలిగినంత మేరకు కూడా ఈ నవవిధభక్తి మార్గాలని చిత్తశుద్ధి కోసం గనుక ఆచరించినట్లయితే, అప్పుడు అవి సరైన దిశగా నెరవేరుతాయన్నమాట. ఈ "చిత్త శుద్ధి" అనేదే చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వేమన పద్యాలలో మనం గమనిస్తే, ఆత్మ శుద్ధి లేని ఆచార మదియేల? అని మనని ప్రశ్నిస్తున్నాడు. మనం అన్ని ఆచారాలని ఆచరిస్తూనే వున్నాం. అన్ని మంత్రాలని జపిస్తూనే వున్నాం. అన్ని పూజలు చేస్తూనే వున్నాం. కానీ అశాంతి అనే ఫలితము మాత్రం దూరమైందా? ప్రాథమికంగా పొందవలసినటువంటి, నీ మానసిక స్థితిలో నీవు అవగాహన చేసుకోవాల్సినటువంటి అంశాలని, అవగాహన చేసుకోకుండానే, మూర్ఖంగా, తామసికంగా వ్యవహరించడం చేత, ఇవన్నీ నిష్ప్రయోజనములైపోతున్నాయన్నమాట. ఈ సాధనలన్నీ ఫలించాలి అంటే, ప్రధానం ఏమిటంటే, నీ జీవనంలో వున్నటువంటి, ఈ గుణ అధ్యయనాలను స్పష్టంగా గనుక అవగాహన చేసుకున్నట్లయితే, తామసిక బుద్ధిని, రాజసిక బుద్ధిని, సాత్విక బుద్ధిని, మనం గనుక తెలుసుకున్నట్లయితే, సాత్విక బుద్ధి దృష్ట్యా మనం జీవనాన్ని గనుక విచారణ చేసి, ఆలోచించి, నిదానంగా కనుక నిర్ణయాలు తీసుకుని, జీవించినట్లయితే, అప్పుడు ఈ సాత్విక బుద్ధితో, మనం దేనినైనా కూడా సాధించ గలిగే నేర్పుని, ఓర్పుని ముందు సంపాదించ గలుగుతాం. ఈ రెండు నైపుణ్యాలవల్ల ప్రశాంతత అదే సమకూరుతుందన్నమాట. అలాగే భయం అనేటటువంటిది ఎప్పుడూ కూడాను, ఒక జంతువు వున్నదనుకోండి, భయపడుతుంది లేదా భయపెడుతుంది. మనిషి ఎప్పుడూ కూడా భయపడకూడదు, భయపెట్టకూడదు. ఎందుకంటే వివేకం కలిగినటువంటి వాడు, భయపడడు, భయపెట్టడు. కాబట్టి ఈ భయపడటము, భయపెట్టడము రెండూ తామసిక లక్షణాలు. ఈ తామసిక లక్షణాలను మొట్టమొదట మనం దూరం చేసుకోవాలన్నమాట. ప్రధానంగా భగవద్గీతలో కూడా, ఈ తామసిక లక్షణాలలో ప్రమాదము, నిద్ర, ఆలస్యము, భయము ఇత్యాది లక్షణాలన్నీ కూడాను తామసిక లక్షణాలుగా భగవంతుడు మనకు చెప్పివున్నాడు. అయితే ఈ తామసిక లక్షణాలు ప్రధానంగా జీవించేటటువంటి వారితో, మనం ప్రవర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే వారు వారికీ ప్రమాదాన్ని కలిగించుకుంటారు, ఇతరులకీ ప్రమాదాన్ని కలిగిస్తారు. కాబట్టి మనం ప్రవర్తించేటప్పుడు సంఘంతో కాని, మన సమాజంతోగాని, కుటుంబంతో గాని, ఇతరులతో గాని, మీ సంసారంలో గాని, మీతో మీరు గాని, ఆ యా విషయాలలో ప్రవర్తించేటప్పుడు, ముందు తామసిక గుణాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలన్నమాట. దీనికి ప్రధానంగా ఏం చేయాలంటే, లక్ష్యం లేదా విశ్వాసం భగవంతుడి మీద వున్నప్పుడు మాత్రమే, ఈ తామసిక గుణాన్ని దూరం చేయగలుగుతాం. ఇవాళ తామసిక పద్ధతిలో జీవించేవారందరూ కూడాను, పూజలని, ఆరాధనలనీ కూడా అదే తామసిక పద్ధతిలోనే ఆచరిస్తూ వుంటారన్నమాట. అవి ఆరాధన కాకపోలేదు. కానీ ఫలితం తామసికంగానే వుంటుందన్నమాట. అంటే, బలులు, అర్పణలు చేసేటప్పుడు, ఆ బలిలో ప్రాణహాని వుంటుందన్నమాట. అటువంటి ప్రాణహానితో కూడినటువంటి పూజావిధానాలలో ఎప్పుడూ కూడా ఫలితం మళ్ళా అటువంటి ఫలితాలనే అందిస్తుంది. తద్వారా దుఃఖమే కలుగుతుందన్నమాట.

            ఈ దుఃఖానికి మూలకారణం భ్రాంతి అని తెలుసుకునే వివేకం, ఈ తామసికమైనటువంటి ఆరాధనల్లో ఎక్కడాకూడా సాధ్యంకాదు. ఎప్పుడూ కూడా భగవంతుడు వేరుగానే వున్నాడు, ఆ దేవి, ఆ తల్లి ఎప్పుడూ కూడా రక్తాన్ని కోరుతుంది. నేను రక్తాన్ని ఇస్తేనే బాగుపడతాను. నేను బలి ఇవ్వాల్సిందే. అనే ధోరణిలోనే ఆలోచిస్తూ వుంటారన్నమాట. దీంట్లోనుంచి బయటపడగలిగినప్పుడే, మానవుడికి వివేకం సాధ్యమౌతుంది. ఎంత త్వరగా మానవజాతి దీంట్లోనుంచి బయటపడగలిగితే, అంత త్వరగా అందరూ వివేకంతో, శాంతి సంయమనాలతో జీవించేటటువంటి అవకాశం లభిస్తుందన్నమాట. ముఖ్యంగా భారతీయ ఋషిసంస్కృతి, ఈ ప్రాణహానిని పూర్తిగా నిరసించిదన్నమాట. అందువల్లనే ఈ ప్రాణహానిలో వున్నటువంటి, ప్రాగమ్యాలని పూర్తిగా భ్రాంతియుతమైనవి కొట్టిపడేస్తుందన్నమాట. ఇవి కేవలము ఒక జంతు సంస్కృతిలో, ఆదిమ మానవుడి కాలంలో, జంతువుతో సమానంగా జీవించే మానవుడి కాలంలో మాత్రమే, అతనికి వున్నటువంటి ఆ వివేక స్థాయిలో మాత్రమే తను నిర్ణయించుకున్నటు వంటి సాంప్రదాయాలు, ఇవి తరువాతి కాలంలో వాటిని ఎంతో విచారణ చేసి, మహర్షులు సుసంపన్నం చేసినటువంటి వేదముల ద్వారా కానీ, ఉపనిషత్తుల ద్వారా కానీ, వీటిని పరిశీలించినప్పుడు, అలాంటి సాంప్రదాయం మనకి ఎక్కడా కనపడదన్నమాట.

            ప్రతిదానికి కూడా వేదాంతంలో సూచక అర్థాలు చాలా వున్నాయన్నమాట. ఎంతో మందికి అనేక రకములైనటు వంటి ఈ వేదాంత పరిధిలో వున్నటువంటి అనేక సమాధానాలు ఎప్పుడూ కావలసివస్తూ వుంటాయి. అవి అనుభవజ్ఞులను అడిగి ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ వుంటే, అంతరార్థాలను వివరించే అవకాశం వస్తుందన్నమాట. వేదాంతంలో నిగూఢంగా వున్నటువంటి ప్రతి మతంలో కూడా బైబిల్‌ కానీ, ఖురాన్‌ కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ బోధించేటటువంటి అనేక అంశాలలో, ఎన్నో రహస్యాలున్నాయి. ఈ రహస్యాలన్నీ మానవ జీవనాన్ని వుద్దేశ్యించి, మానవుడు పూర్తి వివేకంతో జీవించడానికి ఉపయోగించ వలసినటువంటి అన్ని సామర్థ్యాలని, అందులో పొందుపరిచారన్నమాట. అయితే ఆ భాషలో అనేక రకాలైనటువంటి అర్థాలు ఇమిడి వుండటం చేత, ఎవరికి తోచినటువంటి అర్థాన్ని వారు స్వీకరించి, జీవించడం ప్రారంభించారు. ఇట్లా జీవించడం వల్ల, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలుగా, అనేక రకాలైన మతాలుగా, విభిన్నమైనటువంటి కులాలుగా ఇది విడిపోయి, మాది వేరే, మాది వేరే అనుకునేటటువంటి అహం ప్రతిబింబేంచటటువంటి పద్ధతుల్లోకి ఇవి మారిపోయినాయి. కానీ, నిజానికి వేదాంత పరిధిలో కానీ, ఋషి సంస్కృతిలోకాని, ఇటువంటి అహానికి ఏ స్థానము లేదన్నమాట.

            అహాన్ని నిరసించ గలగటమే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. అహాన్ని నిరసించడానికి ఉపయోగించేటటువంటి అన్ని విధానాలని కూడాను భారతీయ ఋషి సాంప్రదాయం ప్రోత్సహించింది. ఎప్పుడైనా సరే మానవుడు వ్యావహారిక జీవనంలో కాని, ఆంతరిక జీవనంలో కాని, తన వ్యక్తి గత జీవనంలో కాని, సామాజిక జీవనంలో కాని, తన యొక్క ఆధ్యాత్మిక జీవనంలో కాని, అహాన్ని నిలుపుకున్నట్లయితే, ఆ అహం తనకు తానే ప్రబల శత్రువుగా మారి, అది తనని అథః పతనం చేస్తుంది. కాబట్టి ఈ అహాన్ని, ప్రతి ఒక్కరూ నిరసించాలి. ఈ అహాన్ని రద్దు చేసుకోవాలి. అహం లేకుండా జీవించాలి. ఇది అప్పుడే సాధ్యమౌతుంది.

            అహం వేరు స్వార్థం వేరు. స్వార్థం అంటే దేహం నేననే భావంతో చూసి, దేహ సౌఖ్యం కోసం ఇతరులను కష్టపెట్టడం స్వార్థం అన్నమాట. కానీ అహాన్ని నిజంగా గుర్తించ గలిగిన వాడు, తన యొక్క వివేక స్థాయిలో ఎప్పుడూ కూడా, తాను ఈ చిత్తశుద్ధిని కలిగినటువంటివాడు ఎవడైతే వుంటాడో, తనలో వున్న అహాన్ని, అహంకారాన్ని ఈ రెండిటిని వేరు వేరుగా గుర్తించ గలుగాతాడన్నమాట. ఆకార భావం ఎప్పుడైతే అహంతో చేరిందో, అప్పుడది అహంకారం అవుతుంది. దేహమే నేను, ఇక అన్యమేమీ లేదు, ఇతరమేమీ లేదు, ఈ దేహం సుఖంగా వుంటే అంత సుఖంగా వున్నట్లే. అని జీవంచేటటువంటి జీవనం వల్లనే, అహంకారం ప్రబలంగా మారి, అందరి మీద ప్రభావాన్ని చూపెట్టేటటువంటి స్థితిలోకి, చేరుకుంటుదన్నమాట. దీంట్లోనుంచి మొట్టమొదట దేహం నేను కాదు అనేటటువంటి వివేకాన్ని, మొట్టమొదట చేపట్టినట్లయితే అప్పుడు ఆకార భావాన్ని త్యజించే ప్రయత్నం చేపడుతామన్నమాట. ఈ ఆకారభావాన్ని త్యజించడం ద్వారా, యథార్థమైనటువంటి అహం అంటే దివ్య అహం, దైవమే నేను అనేటు వంటి అహం, అనేటు వంటి స్థితిలోకి మానవుడు పరిణామం చెందుతాడు. దీనికి ప్రధానంగా గుణాలను పనిముట్లుగా ఉపయోగించగలిగేటటువంటి, గుణాతీత స్థితిలో వున్నప్పుడు మాత్రమే, ఈ దివ్యఅహం స్థితి సాధ్యం అవుతుందన్నమాట. ఈ దివ్యఅహం అన్నపదం భారతీయ వేదాంతంలో చాలా పొదుపుగా, చాలా నేర్పుగా వాడబడిందన్నమాట. ఎందుకంటే 33 కోట్ల దేవతలలో ఎవరు దివ్య అహం?, ఎవరు కాదు? అనే ప్రశ్నలు అనేకమందికి కలుగుతూ వుంటాయి. అయితే అట్లా ఆలోచించినప్పుడు ఈ 33 కోట్ల దేవతలనేటటువంటి సంఖ్యామానంతో పనిలేకుండా దివ్యత్వం అంతా ఒకటే, దివ్యత్వం అంతా ప్రకాశమానమే. అట్టి ప్రకాశ స్వరూపంగా వున్నటువంటి దైవత్వమంతా ఏదైతే వున్నదో, 'ఆ ప్రకాశమే నేను' అనేటటువంటి ప్రాథమిక స్ఫురణ ఏదైతే వున్నదో, దానినే ఆత్మసాక్షాత్కారంగా వేదాంతం నిరూపిస్తూ వచ్చింది.

            ఈ ఆత్మసాక్షాత్కార ప్రభావం చేతనే, అతీత స్థితి యొక్క స్థిరమైనటువంటి స్థితి కలుగుతుందన్నమాట. అయితే ఈ అతీతం బోధ పడాలి అంటే, అది అసమర్థత కాదు, సమర్థత అని నిరూపించబడాలి. అది నిరూపించబడాలి అంటే, ముందుగా సమత్వస్థితిలో జీవించేటటువంటి జీవితం కావాలన్నమాట. శారీరక, ప్రాణక, మానసిక, భౌతిక శక్తులనేటటువంటి నాలుగు శక్తులు మానవుడి ఆధీనంలో వున్నాయి. ఈ నాలు శక్తులలో వున్నటువంటి అసమతౌల్యం కానీ, లేక సత్వరజస్తమో గుణాలలో వున్న అసమతౌల్యం వల్లగానీ మానవుడు సమత్వ స్థితిని కోల్పోతున్నాడన్నమాట. ఎప్పుడైతే ఈ మూడుగుణాల మధ్య, ఈ నాలుగు శక్తుల మధ్య, సమత్వాన్ని సాధించగలుగుతాడో, అప్పుడు పదార్థ పరిధిలో వున్నటువంటి, శక్తి పరిధిలో వున్నటువంటి అన్నీ కూడా తన ఆధీనంలోకి వచ్చి అవి సమత్వ స్థితిలో తనకు లోబడి వుంటాయి అన్నమాట. అవి లోక కళ్యాణ కారకంగానే వుపయోగపడుతాయి కానీ, తన కోసం తాను వుపయోగించుకునే స్థితిలో తాను వుండడన్నమాట.

            ఈ రకంగా ముందు సమత్వ స్థితిని సాధించే ప్రయత్నంలోనే, అష్టాంగ యోగమని అలాగే ధ్యానయోగమని అలాగే ఇతరత్రా అనేక మార్గాలనీ కూడా దీంట్లో ప్రవేశపెట్టారన్నమాట. ఈ సమత్వ స్థితిని సాధించిన వెంటనే, మానవుడు గుణాలను పనిముట్లుగా వుపయోగించుకునే స్థితి, ఆ వివేకం కలుగుతుంది. ఈ సమత్వ స్థితి నుంచి గుణాలను పనిముట్లుగా ఉపయోగించుకోవాలి అనే సామర్థ్యం కలుగగానే, వెంటనే ఆత్మ విచారణ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, "ఈ జీవితం యొక్క ప్రాథమిక మైనటువంటి గమ్యం నన్ను నేను తెలుసుకోవటం మాత్రమే". నన్ను నేను అనేది, దేహమే నేనుగా కాకుండా, సర్వవ్యాపకంగా వున్నటువంటిది ఏదైతే వున్నదో, ఆ సర్వవ్యాపకంగా అన్ని జీవులలోనూ అంతటా వెలసి వున్న, అంతటా నిలచి వున్న, నిలయమై వున్నటు వంటి, సర్వులకు ఆధారమై వున్నటువంటి, ఈ ఆధారస్థితిని తెలుసుకోవాలి నేను. ఇప్పటి వరకు ఆధేయ స్థితిని మాత్రమే తెలుసుకున్నాను. తన మూలాన్ని గుర్తెరిగే ప్రయత్నం, ఈ అతీత స్థితితో ప్రారంభం అవుతుందన్నమాట. తన మూలాన్ని తాను విచారించగా, ఈ చేయి కాలు కన్ను నోరు ఈ లోపల వున్నటు వంటి రక్త మాంసాలు, ఇవేవీ నాకు ఆధారం కాదు. నేను వీటి వల్ల జీవించబడి వుండటం లేదు. అనే సత్యాన్ని ప్రాథమికంగా గుర్తించగలుగుతాడు. తన చేత అవి జీవించబడుతున్నాయే కానీ, వాటి వల్ల తాను జీవించబడి యుండలేదు. తన ఉనికి వాటి మీద ఆధారపడి లేదు. తన ఉనికి చేతనే అవన్నీ కూడా నిలబడి వున్నాయి, అనేటు వంటి స్థిరమైన అభిప్రాయానికి వచ్చి, జీవితంలో అన్ని స్థితులను, అన్ని పరిస్థితులను, అన్ని కోణాలని, అన్ని ఆలోచనల్ని ఆత్మ దృష్ట్యా చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతాడన్నమాట.

            తాను ఆత్మ స్వరూపుడై వున్నాడు, నేను దేహము కాదు అనేటటువంటి ప్రాథమిక నిర్ణయంతోనే, ప్రతి ఆలోచనని ప్రారంభించి, ప్రతియొక్క భావజాలాన్ని కూడా, బుద్ధి యొక్క భావజాలాన్ని మొత్తాన్ని, ఛేదించ గలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి, శుద్ధ బుద్ధిని కలిగి, ఈ శుద్ధ బుద్ధి యందు తన యొక్క మూలాన్ని విచారణ చేసే దశలో, మొట్టమొదటగా తన్ను తాను దర్శించేటటువంటి స్థితి కలుగుతుంది. అదే ఆత్మసాక్షాత్కారం అంటే.

            ఇదే బుద్ధిని ఓడించడం అంటే. ఇదే ఫ్రాయిడ్‌ సైకాలజీలో ఆలోచిస్తే, ఇగో సూపర్‌ ఇగో లను జయించి, ఇడ్‌లో వున్నటు వంటి ఇడ్‌ యొక్క మూలాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం మాత్రమే. అయితే పాశ్చాత్య సాంప్రదాయం చెబుతున్నటువంటి ఈ మానస్తత్వ శాస్త్రంలో ఇడ్‌ అనేది ఎవరికీ అందుబాటులోకి వచ్చేది కాదు, దీన్నేమీ చేయలేం, ఇది మానవుడు భరించవలసిందే, మానవుడిలో వున్నటువంటి అన్ని ఇన్‌స్టింక్ట్స్‌ అంటే వాంఛలన్నీ కూడా ఈ ఇడ్‌లోనే వుంటాయి. అనేటటువంటి విధానం దగ్గర మనస్తత్వ శాస్త్రం ఆగిపోయిందన్నమాట. కానీ భారతీయ యోగసిద్ధాంతం ఎప్పుడూ కూడాను, ఈ ఇడ్‌ అనేది ఎక్కడో లేదు, నీ సుషుప్తిలోనే వుంది, జీవుడి యొక్క నిద్రలోనే వుంది, ఈ నిద్రను అధ్యయనం చేసినవాడే సరైనటువంటి జ్ఞాని అవుతాడు. ఈ నిద్రలో వున్నటు వంటి విద్యయే సరియైనటువంటి విద్య. నిజంగా ఆత్మ సాక్షాత్కారం కానీ, నిజంగా సర్వవ్యాపక స్థితిని గానీ, తన్నుతాను తెలుసుకోవాలనుకునే వాడు, ఈ మెలకువ అవస్థని, కల అనే అవస్థని, నిద్ర అనే అవస్థని, మూడింటిని కూడా సరిగా అధ్యయనం చేసినట్లయితే, ఈ మూడూ కూడా, మనసు పరిధిలో ఇంద్రియాల పరిధిలో జరుగుతున్నటువంటి ఒక మార్పులే కానీ, తన ఉనికి కలగేటటువంటి మార్పులేవీ కావని స్పష్టంగా గుర్తించగలుగుతాడు. అలా ఎవడైతే గుర్తించ గలుగుతాడో, అతడి మీద ఈ వాంఛల యొక్క ప్రభావం ఏమీ వుండదు. ఇంద్రియాల యొక్క ప్రభావం ఏమీ వుండదు. గుణ ప్రభావం తొలగిపోగానే, ఇవన్నీ తన మీద ప్రభావాన్ని చూపెట్టటానికి అశక్తమౌతాయి. అటువంటి అశక్త స్థితిలో తనను తాను తెలుసుకోగలిగి, అన్నిటిని అధిగమించి, తానే రాజైవున్నాడు. తన అనుమతి లేకుండా ఏదీ సాధ్యం కాదని, ప్రతిష్ఠించుకోగలగేటటువంటి సామర్థ్యాన్ని పొందుతాడు. ఈ అనంత సృష్టిని కూడా ఆ దృష్టితో అధ్యయనం చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని పొంది, వ్యష్ట్యానుభవం నుంచి, సమిష్ట్యానుభవంలోకి, అందరిలో వున్నటువంటి, ఈ ప్రత్యక్షమైనటువంటి, ఆ పరోక్షమైనటువంటి, తనకు మూలంగా వున్నటువంటి, ఆత్మస్థితిని చూడగలిగేటటువంటి సామర్థ్యాన్ని, అతను ఆ దర్శన స్థితిని పొందగలుగుతాడు. ఆ దర్శన స్థితియొక్క ప్రారంభమే, ఆత్మ సాక్షాత్కారమై యున్నది అని ఉపనిషత్తులు మనకు స్పష్టంగా బోధిస్తూ వున్నాయి.

            ఈ ఉపనిషత్తులు బోధించినటువంటి ఆత్మసాక్షాత్కారంతో, ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం అవుతుందన్నమాట. ఆధ్యాత్మికము అంటే అర్థం ఏమంటే? అన్నింటికంటే ఆత్మయే అధికమైనది. ఆత్మ తప్ప ఇతరములు ఏవీ అధికములు కావు. జీవుడు కానీ, జగత్తు కానీ ఇంకెన్ని రకాలుగా ఈ అనేకంగా కనబడుతున్నటువంటి, ఎన్ని వస్తు పద్ధతిగా కానీ, ఏవి చూసినా కూడా, ఇవన్నీ కూడా ఆత్మ ముందు న్యూనతమములే. అంటే పనికిరానటువంటివే. మార్పు చెందేటటువంటివే. అంటే శాశ్వతమైనటువంటివి కావు. తమని తాము సృష్ట్యాది స్థితి వరకూ నిలబెట్టుకోగలిగేటటువంటి సామర్థ్యము వున్నటువంటివి కావు. తమ మూలాన్ని తాము తెలుపగలిగే టటువంటి సామర్థ్యము కలిగిలేవు ఇవి. కేవలము ఆత్మ మూలముగా మాత్రమే, తన మూలాన్ని తాను జీవుడు తెలుసుకోగలుగుతున్నాడు. అనేటటువంటి ప్రత్యక్ష పరోక్ష నిదర్శనాలని, స్పష్టమైనటువంటి ఆత్మ విచారణని కలిగివుండి, ఆత్మానుభవం దిశగా సాధకుడు ముందడగులు వేస్తాడన్నమాట.

            ఎవరైతే ఈ త్రిగుణాలను అర్థం చేసుకుని, సమత్వ స్థితిని పొందగలుగుతారో, వారందరూ సాధకులుగా పిలవబడుతున్నారు. ఎవరైతే సమత్వ స్థితి నుంచి అతీత స్థితికి, గుణాలని పనిముట్లుగా వుపయోగించి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలుగుతున్నారో, వాళ్ళందరూ కూడాను జ్ఞానులుగా పిలవబడుతున్నారు. అయితే ఈ సాధకుడికైనా, ఆ జ్ఞానికైనా ప్రాథమికంగా చిత్తశుద్ధిని పొందాలి అంటే, నవవిధ భక్తి మార్గాలని తప్పనిసరిగా, త్రికరణ శుద్ధితో ఆచరించడమే ప్రధానం. అవి వాటియొక్క అంతరార్థాన్ని, స్పష్టంగా తెలుసుకుని, అవి దేనిని సూచిస్తున్నాయో తెలుసుకుని, ఆ దిశగా వాటిని ఆచరించి, ఈ ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆత్మానుభవం దిశగా తమ జీవితాన్ని నడిపేటటువంటి వారు, ధన్యజీవులని పిలవబడుతున్నారు. అంటే అర్థం ఏమిటంటే, జీవిగా తాను దేహాన్ని ధరించిన తరువాత, శరీరాన్ని ధరించిన తరువాత, తన గమ్యాన్ని, తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకుని, మధ్యలో కనబడుతున్నటువంటి అనేక, ఆల్చిప్పల దిశగా కాకుండా, సముద్ర గర్భంలో వజ్రాలకోసం, పగడాలకోసం, రత్నాల కోసం, ముత్యాల కోసం అన్వేషించే వాడు ఎంత దీక్షతో అయితే అన్వేషిస్తాడో అలాగే తన యొక్క మూలాన్ని తెలుసుకోవాలనేటటువంటి దిశగా తన జీవితాన్ని నడుపుతాడన్నమాట.

            ఇక్కడి నుంచి జ్ఞాని యొక్క దశ ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభ దశ స్థితి నుంచే, జ్ఞాని యొక్క అనుభవం ప్రారంభం అవుతుంది. తనను తాను నిరూపించుకొన్న తరువాత, తనను తనలో తానే కాకుండా, తన చుట్టూ సర్వత్రా వున్నటు వంటి జగత్తులో కూడా, తనను తాను చూసుకోగలిగేటటువంటి సామర్థ్యం కలుగుతుందన్నమాట. ఈ కలగడానికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఏమిటంటే, ఇవన్నీ వివరించి చెప్పాలి అంటే, అంతర ఇంద్రియాల స్థితి నుంచి మొదలు పెడితే, ఆత్మసాక్షాత్కార స్థితి నుంచి ఆత్మానుభవ స్థితి వరకూ కూడా, ప్రతి అడుగులో కూడాను గురువు యొక్క సహాయం వుంటుందన్నమాట.

            ఈ గురువు సహాయం లేకపోతే ఇవి వివరించి చెప్పడమూ కానీ, వివరించి చూపెట్టగలిగే సామర్థ్యము గానీ, వాటిని అధిగమింప జేసే శక్తిని కానీ, పోరాడ గలిగే శక్తిని గానీ, విశ్వాసాన్ని అందించడం గానీ, యథార్థంగా భగవంతుని యెడల కొండలనైనా కదుపగలిగేటటువంటి విశ్వాసాన్ని పాదుగొలిపేటటువంటి స్థితిని గానీ, ఈ సర్వమూ కూడా గురుకృప చేతనే సాధ్యం అవుతుంది. కాబట్టి గురువుని ఆశ్రయించడం తప్పనిసరి. ఈ స్థితులను పొందిన తరువాత, అప్పుడు గురువును ఆశ్రయించడంలో వున్నటువంటి, యథార్థమైనటువంటి అనుభవాన్ని, సాధకుడు పొందగలుగు తాడన్నమాట. ఎవరైతే ఈ సాధకులన్నారో, వీరందరూ ఉత్తమసాధకులుగా పరిగణించ బడుతారు. ఈ ఉత్తమసాధకులలో కొంతమందికి శిష్యులుగా మారే అవకాశం లభిస్తున్నదన్నమాట. ఈ శిష్యులకి గురువుకి వున్న ప్రాథమిక న్యాయం ఏమిటంటే, ఈ జనన మరణ చక్రంలో వున్నటువంటి ఈ శిష్యులందరినీ కూడాను, జనన మరణ చక్రంలోనుంచి ముక్తులుగా గానీ, లేదా జనన మరణ రాహిత్య స్థితికి గాని, ఆయాజీవుల సకృత బలాన్ని అనుసరించి, వాసనాబలాన్ని అనుసరించి, ఎన్ని జన్మలలో అయితే వారు సాధించగలుగుతారో, అన్ని జన్మల వరకూ కూడా, సమర్థమైనటువంటి ఉపదేశాన్ని, బోధని, ఆ శక్తిని సామర్థ్యాన్ని, అనుగ్రహించటమే, గురుశిష్య న్యాయంలో వున్నటువంటి గొప్పసూత్రం అన్నమాట. భారతీయ సంస్కృతిలో ప్రతిష్ఠించబడినటువంటి, గురు సాంప్రదాయం ఇదే ఋషిసాంప్రదాయం, ఆ గురు స్థానం ఏదైతే వున్నదో, అది ఇతర సాంప్రదాయాలలో లేదన్నమాట. అన్యమతాలలో కూడా లేదు. ఒక్క ఋషి సాంప్రదాయంలో మాత్రమే, వేదాంత పద్ధతిలో మాత్రమే, గురువు అత్యున్నతుడు. దైవసమానుడు. గురువే దైవము. దైవానికి మార్గమే చూపెట్టే వాడే గురువు. అని మొదట్లో చెప్పినప్పటికీ, కానీ కట్టకడపటికి తేలేదేమంటే, శిష్యుడి యొక్క లక్ష్యం గురువే అయివున్నాడు. శిష్యుడు గురువు ఎప్పుడైతే అంతర్థానం అయ్యేటటువంటి స్థితి కలుగుతుందో, అంటే శిష్యుడు లేడు, గురువు లేడు, ఇద్దరూ కూడా ఒకే స్థితిలోనే వున్నారు. హృదయంలో ఐక్యం చెందారు. శరీరాలు వేరుగా కనపడుతున్నప్పటికీ, ఇద్దరికీ అంతరంగంలో వున్న అనుభవం ఒక్కటే అయినటువంటి స్థితి ఏదైతే వున్నదో, సర్వవ్యాపక సమిష్టి అనుభవం ఏదైతే వున్నదో, కర్మ రద్దైన స్థితి ఏదైతే వున్నదో, వాసనా బీజములు రద్దైన స్థితి ఏదైతే వున్నదో, వాసనా రాహిత్య స్థితి ఏదైతే వున్నదో, ఇటువంటి అనేక పేర్లతోటి, ఈ స్థితిని నిర్మిస్తూ వున్నది వేదాంత పద్ధతి. ఇటువంటి గురుసత్తాని అధ్యయనం చేయాలన్నా, మాటలు చాలవు, పుస్తకాలు అంతకంటే చాలవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురు సత్తాను తెలుసుకోవాలి అంటే, గురుకృపను పొందాలి అని అంటే, తప్పనిసరిగా శిష్యుడిగా అర్హతను సంపాదించాలి. (to be cont…)